ANDRAPRADESH, MAY 19: ఆంధ్రప్రదేశ్‌లో బోర్ల తవ్వకాలు, వాటర్ ప్లాంట్లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బోర్ల తవ్వకాలకు, వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు వాల్టా చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 120 ప్రకారం వాటర్ ప్లాంటు నిర్వహించాలంటే పంచాయతీ అనుమతి తీసుకోవాలని తెలిపింది. రాజ్యాంగ అధికరణ 21 ప్రకారం తాగునీరు లగ్జరీ అంశం కాదని.. జీవించే హక్కుల భాగమని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగంపై ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే బాధ్యత ఉంటుందని తెలిపింది.
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంటలో శ్రీను అనే వ్యక్తి ఆర్వో ప్లాంట్ నిర్వహిస్తుండగా.. పొన్నలూరు తహసీల్దార్ 2025లో జులైలో నోటీసులు ఇచ్చారు.. ఆ ప్లాంట్‌కు అనుమతి లేదని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత వాటర్ ప్లాంట్‌తో పాటుగా బోరు బావిని సీజ్ చేయగా.. ప్లాంట్ యజమాని శ్రీను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రామంలో తక్కువ ఖర్చుతో ప్లాంటు ఏర్పాటు చేసి చాలా తక్కువ ధరకు మంచినీరు ప్రజలకు అందిస్తున్నట్లు పిటిషనర్ తరఫున లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. వాల్టా చట్టం ప్రకారం
బోరు బావి తవ్వేందుకు అనుమతి, తీర్మానం అవసరం లేదన్నారు. అలాగే పిటిషనర్ వాదనను అధికారులు వినలేదన్నారు. పిటిషనర్ అధికారులకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదని.. వాటర్ ప్లాంట్‌ను అనధికారికంగా నిర్వహించడానికి అనుమతించలేం కదా అన్నారు న్యాయమూర్తి. పిటిషనర్ వాల్టా, పంచాయతీరాజ్ చట్టాలను ఉల్లంఘించారన్నారు. ప్రజలకు మినరల్ వాటర్‌ను అందించడానికి పిటిషనర్ ప్లాంటు ఏర్పాటు చేశారని తాము గుర్తించామన్నారు.
అదే సమయంలో ప్లాంటులో నీళ్లు ప్రమాణాలకు తగిన విధంగా ఉన్నాయో లేద కూడా చూసుకోవాలన్నారు. అనుమతి తీసుకోకుండానే పిటిషనర్ గ్రామంలో బోరు తవ్వడం, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారని.. అయినా సరే ఆ ఊరిలో తాగునీటి అవసరాన్ని తాము గమనించామన్నారు. అందుకే ఈ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నామని.. పిటిషనర్ అధికారులిచ్చిన నోటీసుకు వివరణ ఇవ్వాలన్నారు. పిటిషనర్ ఆర్వో ప్లాంట్, బోరు తవ్వడానికి అనుమతి కోసం దరఖాస్తు దాఖలు చేస్తే.. తహసీల్దారు దాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

