అమరావతి, మే 27: మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు. ‘వేట కొడవళ్ల నుంచి గొడ్డళ్లకు మారడం వైసీపీ విధానం... ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం మన విధానం... బోత్ ఆర్ నాట్ సేమ్. నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్’ అంటూ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లు రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులే ‘క్రూయల్ మెంటాలిటీ’కి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
ఏపీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. లెగసీ వేస్ట్ క్లీన్ చేశామని... డోర్ టూ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామని తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని, ఆస్తుల భద్రత కోసం ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్‌తో బ్లాక్‌చైన్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ పరిణామాలు కూడా రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌లో యుద్ధం జరిగిందని... ఏపీలో గ్యాస్ సమస్య వచ్చిందని ప్రస్తావించారు. ఆక్వా, అరటికి రేట్లు పడిపోయాయని చెప్పారు. సంక్షేమాన్ని అవకాశంగా మార్చి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నామని వివరించారు.
కేడర్‌ను గౌరవంగా చూసుకోవాలి..
యువతకు కావాల్సింది గొడ్డలి వేటు కాదని... ఉద్యోగాలని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో ‘గొడ్డలి పార్టీ’ వచ్చిందని విమర్శించారు. ‘ఐటీ నుంచి క్వాంటంకు మారడం మన నినాదం’ అంటూ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపైనే తమ దృష్టి అని తెలిపారు. పార్టీ కేడర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నాయకులకు సూచించారు. కేడర్‌ను గౌరవంగా చూసుకోవాలని... ఏ నాయకుడైనా కేడర్‌ను ఇగ్నోర్ చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త నాయకుడే... తయారు చేయాల్సింది అనుచరులను కాదు, నాయకులను అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

