Ticker

6/recent/ticker-posts

టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్!


ఆంధ్రప్రదేశ్, అమరావతి, మే 31: తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి రెండేళ్లు’ పేరుతో నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో మహిళలకు ఇచ్చిన హామీల అమలు, మహానాడులో చేసిన ప్రకటనలు, ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.


సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు కొత్త డ్రామా మొదలెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు పాలిట వైఎస్ జగన్ గొడ్డలి, త్రిశూలం కూడా అని పేర్కొన్నారు. చంద్రబాబు చీఫ్ మినిష్టర్ కాదు, చీటింగ్ మాస్టర్ అని విమర్శించారు. హామీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. మొన్న జరిగింది మహానాడు కాదు, లోగ్రేడ్ మహానాడు అన్నారు. టీడీపీకి, వైసీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని.. టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్ అని సజ్జల చెప్పుకొచ్చారు.

‘ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసింది వ్యవస్థీకృత అరాచకపాలన. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే. వైఎస్ జగన్ ఐదేళ్లలో మహిళలకే పెద్దపీట వేశారు. చంద్రబాబు మోసం చేసి పుండుమీద కారం చల్లుతున్నారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చి ఉన్నవి కూడా పీకేశాడు. చంద్రబాబుకు, జగన్‌కు ఎంతో వ్యత్యాసం ఉంది. అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలనేది జగన్ ఆలోచన.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బాధ్యతగా జగన్ భావించారు. కానీ చంద్రబాబు ఏం చేయకుండానే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చేశానంటున్నాడు. ఇప్పుడు పిల్లలే సంపద, పిల్లల్నికనండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు ఇంటి నుంచే ఎందుకు మొదలుపెట్టరు’ అని సజ్జల ప్రశ్నించారు.

‘నెలకు 1500 ఆడబిడ్డ నిధి హామీని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ముగ్గుర్ని కంటే 30 వేలు నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటున్నాడు. మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన ఒక ఉదాహరణ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోంది. చంద్రబాబుకు జగన్ గొడ్డలిలా కనిపిస్తున్నాడు. తనను రాజకీయంగా సమాధిచేయగల శక్తి జగన్ గారికే ఉందని చంద్రబాబుకు భయం. అందుకే పదే పదే గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండేళ్లలో జరిగిన దోపిడీని ప్రజలకు మనం వివరించాలి. ఆడబిడ్డ నిధి ఇస్తామని చంద్రబాబు చేసిన అతిపెద్ద మోసం. చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలి. మా హామీల సంగతి ఏంటని చంద్రబాబు, లోకేష్, పవన్ ను ఎక్కడ కనబడినా అడగాలి’ అని సజ్జల అన్నారు.