Ticker

6/recent/ticker-posts

ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు


ANDRAPRADESH, AMARAWATHI, MAY 20: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను అక్రమంగా తరలిస్తున్న ఘటనలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారనే సమాచారం రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టేందుకు డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు మంత్రి సూచించారు. ఎరువుల కొరతను కృత్రిమంగా సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రైతులకు అవసరమైన సమయంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు, ప్రత్యేక దళాల నిఘాను మరింత పెంచాలని సూచించారు. 

ఎరువులను పక్కదారి పట్టిస్తున్నట్లు రుజువైతే సంబంధిత డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులను మోసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఇక, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.