మన్యం జిల్లా: ఒక జిల్లా కలెక్టర్ అంటే సాధారణంగా మనకు గుర్తుకు వచ్చేది భారీ కాన్వాయ్, కట్టుదిట్టమైన భద్రత, సాధారణ ప్రజలకు అందనంత దూరంగా ఉండే హోదా. కానీ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మాత్రం ఆ అభిప్రాయాలన్నింటినీ ఒక్క ఘటనతో మార్చేశారు. తన పదవికంటే మానవత్వానికే ప్రాధాన్యత ఇస్తారని మరోసారి నిరూపించారు.
ఆదివారం అధికారిక పర్యటనలు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో, సీతానగరం మండలం చినభోగిలి సమీపంలో జరిగిన ప్రమాదం ఆయన కళ్ల ముందే కనిపించింది. రోడ్డు పక్కన రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూసిన క్షణంలోనే ఆయన స్పందన అసాధారణంగా మారింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు కేవలం ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోతారు. కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం అలా చేయలేదు.
క్షణం ఆలస్యం చేయకుండా తన కాన్వాయ్‌ను ఆపించి, స్వయంగా కారు దిగి బాధితుడి వద్దకు వెళ్లారు. బొబ్బిలి మండలం కృష్ణరాయపురం గ్రామానికి చెందిన అజర్ శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి వెంటనే చర్యలు ప్రారంభించారు. ప్రోటోకాల్, వాహనం, హోదా అనే ఆలోచనలు ఏవీ లేకుండా, తన కారులోనే బాధితుడిని ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు.
ముందుగా సమీపంలోని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య సిబ్బందితో మాట్లాడి, స్వయంగా దగ్గరుండి చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడితో ఆగకుండా, మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బాధితుడిని జాయిన్ చేసే వరకు వెన్నంటి ఉన్నారు. ఒక అధికారి బాధ్యతను దాటి, ఒక మనిషిగా ప్రాణాన్ని కాపాడేందుకు చేసిన ఈ ప్రయత్నం అందరినీ కదిలించింది.

