Ticker

6/recent/ticker-posts

టీడీపీ వర్మకు జనసేన దొరబాబు ఓపెన్ చాలెంజ్


ANDRAPRADESH, PITAPURAM: పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీగా రాజకీయ రచ్చ సాగుతోంది. రెండు పార్టీల క్యాడర్ కి మధ్య అసలు పొసగడం లేదు. ఇదిలా ఉంటే జనసేన స్థానికంగా చేస్తున్న జోరు టీడీపీ నేతలు వేస్తున్న బ్రేకులు వెరసి రాజకీయంగా ఘర్షణలకు దారి తీస్తున్నాయి. తాజాగా డ్వాక్రా మహిళలకు ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమంలో చంద్రబాబు ఫోటో లేదని టీడీపీ ఇంచార్జి పిఠాపురం వర్మ అధికారులను నిలదీశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన జనసేన నేత పెండెం దొరబాబు వర్సెస్ వర్మగా రాజకీయ రచ్చ తీవ్ర స్థాయిలో సాగింది. 


పరస్పరం ఆరోపణలు : వైసీపీ నుంచి వచ్చి అధికారంలో ఉన్న పార్టీలో హవా చలాయిస్తున్నారు పెండెం దొరబాబు అని వర్మ మండిపడ్డారు. ఆయన అయిదేళ్ళ పాటు జనసేన టీడీపీ నాయకులను కార్యకర్తలను ఎమ్మెల్యేగా వేధించారు అని ఆరోపించారు. దొరబాబు తమ మీద పెట్టిన కేసులతో కోర్టుల చుట్టూ ఈ రోజుకీ తిరుగుతున్నామని వర్మ అన్నారు. మట్టి తవ్వుకుని భూములను ఆక్రమించి దొరబాబు ఏకంగా 150 కోట్ల రూపాయల స్కాములు పిఠాపురం నియోజకవర్గంలో చేశారు అని వర్మ విమర్శించారు. ఆయన చేసిన స్కాముల మీద విచారణ జరిపిస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే వర్మతో సహా తన మీద ఆరోపణలు చేస్తున్న అందరి గుట్టు తీసి బయటపెడతాను అని దొరబాబు హెచ్చరించారు.

రాజకీయ సన్యాసం అంటూ : తన మీద ఒక్క అవినీతి అక్రమాల ఆరోపణలు రుజువు చేసినా రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను అని దొరబాబు మీడియా ఎదుట సవాల్ చేశారు. తన మీద ఆరోపణలు చేసిన వారు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. పిఠాపురంలో ఒక్క విషయంలో కూడా తాను అవినీతి చేయలేందని ఆయన అన్నారు. తనది మచ్చ లేని జీవితం అన్నారు. తాను నిజానికి రాజకీయాల నుంచి తప్పుకోవాలనే అనుకున్నానని అయితే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేనలో చేరాను అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనను మంచి మెజారిటీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు. అంతే కాదు వర్మ అండ్ కో చేస్తున్న ఆరోపణల మీద తాను పూర్తి వివరణ ఇస్తాను అని అదే విధంగా వారి విషయంలో కూడా పూర్తి గుట్టు విప్పుతాను అని స్పష్టం చేశారు. 

బాహాటంగానే ఫైట్ : అయితే ఒకే పార్టీలో ఉంటూ ఒకరి గుట్టు మరొకరు విప్పుకుంటామని చెప్పడంతో కూటమిలో అలజడి రేగుతోంది. వర్మ అయితే దొరబాబు స్కాములను బయట పెడతామని అంటున్నారు. ఆయనకు జనసేనతో సంబంధం లేదని కేవలం తాను చేసిన అవినీతిని కప్పుపుచ్చుకోవడానికే ఆ పార్టీలో చేరారు అని వర్మ విమర్శించారు. అదే విధంగా వర్మ గుట్టు తన దగ్గర ఉందని దొరబాబు అంటున్నారు. ఇలా ఇద్దరూ మీడియాకు ఎక్కడంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ విధంగా కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు వీధిన పడితే పోయేది కూటమి పరువే అని అంటున్నారు.