Ticker

6/recent/ticker-posts

జీలుగుమిల్లి మండలం రాసన్నగూడెంలో దళిత స్మశాన భూమి ఆక్రమణపై ఆందోళన


జీలుగుమిల్లి, ఏప్రిల్ 14: దళితులకు చెందిన స్మశాన భూమిని రక్షించడంతో పాటు గ్రామంలో కొనసాగుతున్న అంటరానితనంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రవి డిమాండ్ చేశారు. జీలుగుమిల్లి మండలం రాసన్నగూడెం గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, దళితుల స్మశాన భూమిని స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టారు. గ్రామంలో దళితులకు కేటాయించిన సుమారు 35 బై 30 ఎకరాల 20 సెంట్ల భూమి ఇప్పటికే పెద్దఎత్తున ఆక్రమణకు గురైందని, ప్రస్తుతం రహదారి తప్ప మరే భూమి కనబడని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన కొద్దిపాటి స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

గ్రామంలో ఇప్పటికీ అంటరానితనం కొనసాగుతుండడం దురదృష్టకరమని, దళితులకు రామాలయంలో కొబ్బరికాయ కొట్టే అవకాశం లేకపోవడం, దేవుని ఊరేగింపులు దళితవాడలోకి అనుమతించకపోవడం వంటి ఘటనలు సామాజిక అసమానతలను స్పష్టంగా చూపిస్తున్నాయని విమర్శించారు.

అధికారులు తక్షణమే స్పందించి స్మశాన భూమిని సర్వే చేసి అభివృద్ధి చేసి దళితులకు అప్పగించాలని, ప్రతి నెల గ్రామాల్లో పోలీసులు, తహసీల్దార్లు పర్యటిస్తూ అంటరానితనంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విజిలెన్స్ కమిటీలు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిరిబత్తుల సీతారామయ్య, కమిటీ సభ్యులు బొమ్మల కొండలరావు, కారం బోడెమ్మ, జిల్లా కమిటీ సభ్యులు గూడెల్లి వెంకట్రావు, జక్కుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.