ఆంధ్రప్రదేశ్: కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టిడిపి ఒక కీలక లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. దీనిలో ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడంతో పాటు బలమైన నియోజకవర్గాల్లో వైసీపీని ఓడించాలనేది కీలక లక్ష్యంగా ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకత్వం పరంగా కూడా పార్టీని మరింతగా ముందుకు తీసుకు వెళ్ళాలి అన్నది టిడిపి పెట్టుకున్న కీలక టార్గెట్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్థాయిలోనూ అదే విధంగా జాతీయస్థాయిలో కూడా పదవులను ప్రకటించారు.
ఈ నెల 29న ఆయా నాయకులు బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే పార్టీ పరంగా లక్ష్యాలు నిర్దేశించుకోవడం బాగానే ఉన్నప్పటికీ వీటిని సాధించే విషయంలో అనేక సవాళ్లు పార్టీకి ఎదురయ్యే అవకాశం ఉంది అన్నది సీనియర్లు చెబుతున్న మాట. ప్రధానంగా వైసిపి క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉందని భావిస్తున్నప్పటికీ ఎన్నికల సమయానికి పార్టీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా వైసీపీకి బలంగానే ఉన్నారన్నది టిడిపి నేతల మధ్య జరుగుతున్న చర్చ.
వీటికి తోడు వైసిపి హయాంలో సంక్షేమ పథకాలు నిరంతరం అందాయని ఇప్పుడు కొంత గ్యాప్ వస్తుందని పెద్ద ఎత్తున ప్రజానీకంలో చర్చ నడుస్తోంది. దీనిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రాజకీయంగా చూసుకుంటే టిడిపికి బలమైన కార్యకర్తలు ఉన్నా బలమైన నాయకులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వారి మధ్య కలివిడితనం కనిపించడం లేదన్నది పార్టీలోనే కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. మీరందరినీ గాడిలో పెట్టడంతో పాటు సమన్వయం కోసం మంత్రులకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు.
కానీ ఇప్పటివరకు ఏ తరహా చర్యలు తీసుకున్నారన్నది స్పష్టం కాలేదు. మొత్తంగా మూడు కీలక అంశాలు పార్టీ లో సమస్యగా మారాయి. 1) నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం. 2) ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే యంత్రాంగం లేకపోవడం. 3) బలమైన నాయకులు ఉన్నప్పటికీ ఎన్నికలు వచ్చేవరకు వేచి చూద్దామన్న ధోరణి అవలంబించడం. ఈ మూడు సవాళ్లను అధిగమిస్తే తప్ప వచ్చే ఎన్నికల నాటికి టిడిపి తాను పెట్టుకున్న లక్ష్యాన్ని సంపూర్ణంగా సాధించుకునే పరిస్థితి ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

