Ticker

6/recent/ticker-posts

రీ-సర్వేలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం – రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు వేగంగా అందించాలి : కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, ఏప్రిల్ 22: జిల్లాలో కొనసాగుతున్న రీ-సర్వే కార్యక్రమాలను పూర్తిస్థాయి ఖచ్చితత్వంతో, పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. రైతులకు సంబంధించి భూహక్కుల సమస్యలు లేకుండా సక్రమంగా రికార్డులు నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు.


జిల్లా కలెక్టరేటులోని గోదావరి సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీ-సర్వే పనుల పురోగతి, పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణ మరియు పంపిణీ, 22-A భూ సమస్యలు, అలాగే PGRS లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ-సర్వే ఫేజ్ 1, 2, 3, 4 పనులు సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా, ఎటువంటి లోపాలు లేకుండా పూర్తిచేయాలని సూచించారు. ముఖ్యంగా జాయింట్ ఎల్పీఎం (Joint LP Map), భూవిస్తీర్ణం వంటి వివరాల్లో వ్యత్యాసాలు ఉంటే వాటిని పూర్తిగా సరిచేసిన తర్వాత మాత్రమే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని ఆదేశించారు.

పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు అందజేయడంలో వేగం పెంచాలని, అయితే ఖచ్చితత్వం విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తయిన రీ-సర్వే గ్రామాల డేటాను డిజిటల్ రూపంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖను ఆదేశించారు.

మే నుండి ఆగస్టు వరకు చేపట్టబోయే రీ-సర్వే పనులకు ముందుగానే గ్రామస్థాయిలో రైతులకు సమాచారం అందించి, స్పష్టమైన కార్యాచరణతో అమలు చేయాలని సూచించారు. మ్యూటేషన్ మరియు సర్వే పూర్తైన గ్రామాల్లో మరోసారి వెరిఫికేషన్ చేసి, తప్పులేని డేటాను సిద్ధం చేయాలని ఆదేశించారు.

22-A భూ సంబంధిత సమస్యలపై PGRS లో వచ్చిన ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. రైతులకు భూ హక్కులపై ఎలాంటి సందేహాలు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు.

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, గ్రామస్థాయిలో వీఆర్ఏలు మరియు సర్వే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డీఆర్వో యల్. దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవోలు ఎం.వి. రమణ, ఐ. కిషోర్, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీ, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.