ఆంధ్రప్రదేశ్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణానికి జగన్ కారణమనే నాడు వ్యక్తమైన అనుమానాలు నేడు నిజమని నమ్మే పరిస్థితులు వచ్చాయని అన్నారు. జగన్ నైజం చూస్తుంటే నాడు బొత్స చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తోందంటూ అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు, వైఎస్ వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. పదవి కోసం జగన్ సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
జగన్ రాష్ట్రంమీద కక్ష కట్టాడు
‘ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల కుటుంబాలు, సమాజం ఎలా విధ్వంసం అవుతుందనే దానికి వైఎస్ జగన్ బెస్ట్ ఎగ్జాంపుల్. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో స్వర్ణయుగం లాంటి పాలన సాగింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ‘2019-24 మధ్య కాలంలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చాడు... విధ్వంసం చేశాడు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 22 నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీ సంపూర్ణ సహకారం అందించడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం అమలు చేస్తున్నాం.
రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద జగన్ మోహన్ రెడ్డికి ఎందుకింత కక్ష..? రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరిగేలా పరిపాలన సాగిస్తున్నాం. పరిశ్రమలు తెస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడుతున్నాం.. సీమకు నీళ్లు ఇస్తున్నాం. ఇంత మంచి జరుగుతుంటే రాష్ట్రం మీద జగన్ కక్ష పెట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నాడు’ అని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
తండ్రిని అడ్డడంపెట్టుకుని వేల కోట్లు సంపాదించిన జగన్
‘2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే నాటికి ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ డబ్బులు సంపాదించారనే విషయం కూడా అందరికీ తెలుసు. తన తండ్రిని కూడా జగన్ మానసిక క్షోభకు గురి చేశాడు. రాష్ట్రంలో జగన్ ఉంటే తనకు... రాష్ట్రానికి నష్టమని నాడు వైఎస్ఆర్ ఆయన్ను బెంగళూరుకు పంపారు. ఈ విషయం రోశయ్యే చెప్పారు’అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.‘రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు గన్నారు.. వైఎస్ఆర్ బతికి ఉంటే తాను సీఎం కాలేనని భావించారు. 2009లో వైఎస్ఆర్ తిరిగి సీఎంగా ఎన్నికయ్యారు... చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తే హెలికాప్టర్ మిస్ అయింది.. అందరూ ఆందోళనలో ఉన్నారు. నాడు చంద్రబాబు కూడా టెలీకాన్ఫరెన్స్ తీసుకుని ఏమైనా సమాచారం లభ్యమవుతుందోమో చూడాలని మాకు చెప్పారు’అని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం
‘వైఎస్ఆర్ చనిపోయే సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది...? వైఎస్ఆర్ చనిపోయిన రోజునే పోలవరం టెండర్లను ఆన్ లైన్లోకి ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది..? వైఎస్ మరణం ఇంకా నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేపట్టారు’అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ‘వైఎస్ మరణం మీద చాలా మంది నాడే అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని ప్రస్తుతం వైసీపీలో ముఖ్యనేతగా ఉన్న బొత్స కామెంట్ చేశారు. ఆ రోజు మేం నమ్మలేదు.. సభ్య సమాజంలో ఇలా ఎందుకు చేస్తారని అనుకున్నాం. సైకోకు పదవీ వ్యామోహం ఉంటే తండ్రిని, తల్లిని, చెల్లిని, బాబాయినైనా వదలరని ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతోంది’అని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తండ్రి, బాబాయి చావులతో లబ్ధిపొందిన జగన్
‘వైఎస్ మరణానికి రిలయెన్స్ సంస్థలే కారణమంటూ ఆ సంస్థల మీద జగన్ దాడులు చేయించారు... తిరిగి వాళ్లకే రాజ్యసభ సీటు కట్టబెట్టారు. 2014లో తండ్రి మరణం నుంచి సింపతీ పొంది ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించాడు. 2019లో అధికారం కోసం సొంత బాబాయిని చంపారు. అధికారం దక్కించుకున్నారు. వివేకాను ఎవరు చంపారంటే రాష్ట్రంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు. వైఎస్ చనిపోయినప్పుడు... వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన వ్యక్తి జగన్ ఒక్కరే’అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
తండ్రి మరణంతో సింపతీతో పార్టీ పెట్టారు... వివేకా మరణంతో సీఎం అయ్యారు. తండ్రి-బాబాయి చావులతో జగనే లబ్దిపొందారు. ఇప్పుడు తల్లి, చెల్లి కూడా జగన్ అసలు నైజం గురించి చెబుతున్నారు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని తల్లి అడిగితే, తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్ మోహన్ రెడ్డిది. రోశయ్య చెప్పినా.. బొత్స చెప్పినా.. మాకు అనుమానాలున్నా మేం నిజం కాదేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవన్నీ నిజమేనని అనిపిస్తోంది’అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
సీఎం పదవి కోసం కాంగ్రెస్ మీద దాడి చేసిన జగన్
‘సైకోకు పదవీ వ్యామోహం ఉంటే ఎలా ఉంటారో జగన్ మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం ఎలా ఉన్నా... కుటుంబం ఎలా ఉన్నా... సమాజం ఎలా ఉన్నా జగన్‌కు పట్టదు.. అతనికి పదవే ముఖ్యం. నిలకడలేని వ్యక్తిత్వం ఉన్నవాళ్లని సైకో అంటారు’అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘సీఎం పదవి కోసం కాంగ్రెస్ మీద దాడి చేశారు... బెయిల్ కోసం సోనియా కాళ్ల మీద పడ్డారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి అంగీకారం తెలిపారు... అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పారు.
అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కన పడేసి మూడు రాజధానులని చెప్పారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య తగువు పెట్టడం జగన్ నైజం. మూడు ప్రాంతాల ప్రజలు వైసీపీకి కర్ర కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారు. అప్పుడు మూడు ప్రాంతాల మధ్య తగువు పెట్టారు... ఇప్పుడు జిల్లాల మధ్య తగువు పెడుతున్నారు’అని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మావిగన్ ప్రతిపాదనను వైసీపీ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు
‘వైసీపీలో ఉన్న వాళ్లు కూడా మావిగన్ ప్రతిపాదనపై ఎగతాళి చేస్తున్నారు... జోకర్‌లా చూస్తున్నారు. సిగ్గు లేకుండా మావిగన్ అంటూ చేసిన ప్రతిపాదనపై నవ్వుకుంటున్నారు. జగన్ తరహాలోనే ఆ పార్టీలోని కొందరు సీనియర్లు తయారయ్యారు’అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘పీసీసీ అధ్యక్షులు చేసిన వారు.. మంత్రులుగా చేసిన వారు జగన్‌కి వంత పాడుతున్నారు. నిన్నటి వరకు జగన్ మాత్రమే పిచ్చోడని అనుకున్నాం... కానీ ఆ పార్టీలో కొందరు పెద్ద పిచ్చోళ్లల్లా తయారయ్యారు’అని మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.
ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు ఉందా?
‘ఉత్తరాంధ్రకు ఏం చేశామో కాలికి గజ్జె కట్టుకుని చెబుతాం. ఇప్పుడు మావిగన్ అంటున్న జగన్... అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు..?’అని మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు. ‘పూటకో మాట అన్నట్టగా పదవీ వ్యామోహంతో సైకోగా వ్యవహరిస్తున్నారు. ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు జగన్ కు ఉందా..? అక్రమ సంపాదనతో రాధాకృష్ణ పత్రిక పెటలేదు... జర్నలిస్టుగా ఉండి పత్రిక పెట్టారు. ఆర్కే మాట్లాడింది తప్పు అని ఖండించవచ్చు... న్యాయ స్థానానికి వెళ్లొచ్చు. జగన్ ఎవర్ని వదిలారు.. తన చానల్‌లో అమరావతి మహిళలను అవమానించారు... వ్యభిచారులు అన్నారు’అని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.
‘మా తల్లి లాంటి భువనేశ్వరి మీద వ్యాఖ్యలు చేయలేదా...?
ఆఖరికి సొంత చెల్లి షర్మిళ అసలు రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని సోషల్ మీడియాలో మాట్లాడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఉంటారు... ప్రజలకు అన్నీ తెలుసు. పోలీస్ స్టేషన్లు తిప్పుతాడట... ఇవన్నీ మేం చూసేశాం… 2019లో నువ్వు చేసిన దారుణాలివే కదా. మళ్లీ వస్తాం.. అమరావతిని మార్చేలా తొలి సంతకం చేస్తామంటూ పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. సమాజానికి జగన్ మోహన్ రెడ్డి చీడ పురుగు. ఇష్టానుసారంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు... ప్రజలు ఈ పరిణామాల్ని గమనించాలి. ఒక్క వ్యక్తి తన పదవి కోసం ఎంత మందిని పొట్టన పెట్టుకున్నారో ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలి’అని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

