ఆంధ్రప్రదేశ్, అమరావతి: రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించిన సంగతి తెలిసిందే. అయితే రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణకు పలువురు రైతులు ఉదారంగా వచ్చి మరీ భూమలు ఇచ్చారు. ఇలా రెండో విడత భూ సమీకరణకు సహకరించిన రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం అర్ధరాత్రి సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
రూ.1.50 లక్షల రుణమాఫీ
రెండో విడత భూ సమీకరణపై రాజధాని రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు హామీల వర్షం కురిపించారు. రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కౌలును ప్రకటించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అలాగే కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీకి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. అంతేకాదు ఏడాదికి రూ.3 వేలు చొప్పున కౌలు పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారు.
రైతులెవ్వరికీ అన్యాయం జరగనివ్వను: సీఎం చంద్రబాబు
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ భూముల్లో ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బాధ్యత తనదని, రైతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి.. భూ సమీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదనే చట్టబద్దత కల్పించామని రైతులకు వివరించారు.
ముఖ్యమంత్రితో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఎండ్రాయి, పెదమద్దూరు, వైకుంఠపురం, కర్లపూడి, పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలకు చెందిన 70 మంది రైతులు పాల్గొన్నారు. అయితే తమకు అభివృద్ధి చేసిన స్థలాలను ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఇవ్వాలని కర్లపూడి గ్రామస్థులు కోరారు. అంతేకాదు తమకు ఒకేచోట స్థలాలు ఇవ్వాలని ఎండ్రాయి, పెద్దమద్దూరు, కర్లపూడి, వైకుంఠాపురం గ్రామాల రైతులు సీఎం చంద్రబాబు నాయుడును కోరారు.

