Ticker

6/recent/ticker-posts

అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!


ఏలూరు: వేసవి సీజన్ ప్రారంభం కావడంతో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల వరకు కిలో రూ.30 దాటని నిమ్మకాయలు, ఇప్పుడు మార్కెట్‌లో ఏకంగా రూ.120 నుంచి రూ.130 వరకు పలుకుతున్నాయి. ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, రైతులు మాత్రం దిగుబడి లేక ఆవేదన చెందుతున్నారు. ఏలూరు నిమ్మకాయల యార్డులో ప్రస్తుతం కిలో నిమ్మకాయలు రూ.120 నుంచి రూ.130 వరకు అమ్ముడవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా రేట్లు ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


వేసవి కారణంగా పెరిగిన డిమాండ్
వేసవి కాలంలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయాలు, నిమ్మరసం, గృహ వినియోగం కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో సహజంగానే మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. అయితే, సరఫరా తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

దిగుబడి లేక రైతుల ఆవేదన
ధరలు పెరిగినా రైతులు ఆనందంగా లేరు. కారణం, ఈసారి నిమ్మకాయల దిగుబడి తీవ్రంగా తగ్గిపోయింది. తెగుళ్ల ప్రభావం, వాతావరణ మార్పులు కారణంగా పంట నష్టపోయిందని.. సరైన దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.. గతంలో ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం 15 బస్తాలు కూడా రావడం లేదని వారు వాపోతున్నారు. ధరలు పెరిగినా అమ్మడానికి సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో లాభం లేదని అంటున్నారు. అయితే, నిమ్మకాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. ఒక్కో నిమ్మకాయ ధర కూడా పెరగడంతో రోజువారీ వినియోగంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.