ఆంధ్రప్రదేశ్, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే స్పీడుగా నిషేదిత మాదకద్రవ్యాలను అరికట్టేందుకు స్పీడు పెంచింది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో తిరుపతి జిల్లా అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. నాలుగు టన్నుల ఒక కింటా బరువు కలిగిన గంజాయి అంటే సుమారు రూ.20కోట్ల రూపాయల విలువైన గంజాయిని దగ్ధం చేశారు అధికారులు. గత కొద్ది రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టుకున్న గంజాయిని గురువారం కాల్చేశారు.
రూ.20 కోట్ల గంజాయి దగ్ధం..
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, నాయుడుపేట, పుత్తూరు సబ్‌డివిజన్‌ల పరిధిలో గత కొంతకాలంగా నమోదైన వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 4100 కిలోల గంజాయిని ప్రత్యేక ఎలక్ట్రికల్ యంత్రం ద్వారా దగ్ధం చేశారు. ఈ మాదక ద్రవ్యాల మార్కెట్ విలువ దాదాపు రూ.20 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందో స్పష్టమైంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఐజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఇకపై కూడా తనిఖీలు కంటిన్యూ..
జిల్లా స్థాయిలో కూడా నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి రవాణా, నిల్వలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని, లక్షమంది విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల్లో జిల్లాలో స్వాధీనం చేసుకున్న గంజాయిని దాదాపు నాలుగు వేల కిలోలకు పైగా దగ్ధం చేసినట్లు తెలిపారు.
_11zon.jpg)
