Ticker

6/recent/ticker-posts

ట్రెండీ టాక్: ఇరాన్‌లో అణుబాంబ్ పేలితో హైద‌రాబాద్‌కు ముప్పు?


WORLD NEWS: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అణ్వాయుధ దాడుల దిశగా వెళ్తే దాని ప్రభావం భారత్‌పై ఏ మేరకు ఉంటుందనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు జరిగితే అక్కడ విడుదలయ్యే రేడియేషన్ గాలి ద్వారా ప్రయాణించి భారత్‌లోని ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు చేరుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉక్రెయిన్‌లోని చర్నోబిల్ రియాక్టర్ పేలినప్పుడు ఆ ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలోని దేశాలపై పడిన ఉదాహరణలు ఉండటంతో ఇరాన్ నుంచి భారత్‌కు ఉన్న సుమారు 2,500 నుండి 3,500 కిలోమీటర్ల దూరం రేడియేషన్ వ్యాప్తికి అసాధ్యమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.


సాంకేతికంగా చూస్తే.. రేడియేషన్ అనేది `ఫ్లూమ్స్` రూపంలో గాలి దిశ, వేగం .. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ప్రయాణిస్తుంది. ఇరాన్ లోని బుషహర్ వంటి కీలక అణు ప్లాంట్లపై దాడులు జరిగితే..ఆ రేడియోధార్మికత గాలి ద్వారా తొలుత గల్ఫ్ దేశాలకు.. ఆ తర్వాత సముద్ర మార్గం గుండా గుజరాత్.. మహారాష్ట్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉంది. ఒకవేళ రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటే.. అది మానవ శరీరంలోని డీఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. వాంతులు, అలసట, జుట్టు రాలడం వంటి లక్షణాలతో మొదలై అంతర్గత అవయవాల వైఫల్యానికి ఇది కారణమవుతుంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ నుంచి భారత్‌కు ఉన్న ఏరియల్ దూరం సుమారు 2,400 నుండి 2,800 కిలోమీటర్లు. ఇంత సుదీర్ఘ దూరంలో రేడియేషన్ ప్రయాణించే లోపు దాని తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది ..డైల్యూట్ అవుతుంది.. అంతేకాకుండా.. ప్రస్తుత సీజన్‌లో గాలి దిశ ఇరాన్ నుండి భారత్ వైపు వీచే అవకాశం తక్కువగా ఉందని వాతావరణ విశ్లేషణలు చెబుతున్నాయి. భారత్ కంటే కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకే ఈ ముప్పు ఎక్కువగా పొంచి ఉంది.

ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడి రేడియేషన్ లీక్ అయితే... ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం (ఇండోర్ స్టే) ఉత్తమ మార్గం. కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేసి గాలి చొరబడకుండా జాగ్రత్త పడాలి. పొరపాటున బయట ఉన్నప్పుడు రేడియేషన్ సోకినట్లు అనుమానం వస్తే.. వెంటనే ఇంటికి వచ్చి బట్టలను ప్లాస్టిక్ కవర్లలో భద్రపరిచి పారేయాలి. థైరాయిడ్ క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి పొటాషియం అయోడైడ్ వంటి మాత్రలు అందుబాటులో ఉంటాయి.. అయితే వీటిని కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

ఓవ‌రాల్ గా.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారత్‌లో మళ్లీ లాక్-డౌన్ విధిస్తారనే వార్తల్లో ఇప్పటికైతే వాస్తవం లేదు. సాధారణ రియాక్టర్ ప్రమాదాల వల్ల భారత్‌కు వచ్చే ముప్పు చాలా తక్కువ. కానీ ఒకవేళ అది పూర్తి స్థాయి అణు యుద్ధంగా మారి భారీ స్థాయిలో అణు బాంబులు పేలితే మాత్రం వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం.. రష్యా వంటి దేశాలు ఈ అణు ప్లాంట్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం కోసం వేచి చూడటం శ్రేయస్కరం.