Ticker

6/recent/ticker-posts

వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు మరోసారి అస్వస్థత


అమరావతి, మార్చి 6: ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో ఇబ్బంది పడుతున్న బొత్స.. మండలిలో మాట్లాడుతుండగా కింద పడబోయారు. దీంతో వెంటనే అసెంబ్లీ అధికార వర్గాలు అత్యవసరంగా వైద్యులను పిలిపించి, ఆయన ఛాంబర్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. 

వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. బీపీలో హెచ్చుతగ్గులు, సరైన సమయానికి భోజనం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వివరించారు. విశ్రాంతి తీసుకోవాలని, అవసరమైతే మరిన్ని వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు.


అలాగే, బొత్సతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బొత్స సత్యనారాయణ హైబీపీతో ఇబ్బంది పడుతున్నారని, బీపీ కంట్రోల్‌లోకి రాకపోతే హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. దీంతో బొత్సను సహచరులు ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.