ANDRAPRADESH, NELLURU: నెల్లూరు నూతన మేయర్ గా టీడీపీ మహిళా నేత దేవరకొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో సుజాత ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికతో నెల్లూరు నగరంపై టీడీపీ కూటమి పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెలాయించినట్లు అయిందని చెబుతున్నారు. నగరంలోని రెండు ఎమ్మెల్యే స్థానాలుతోపాటు కార్పొరేషన్ ను కైవసం చేసుకుని టీడీపీ చరిత్రను సృష్టించిందని వ్యాఖ్యానిస్తున్నారు. 2021 నవంబరులో నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. గత ఏడాది నవంబరులో మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. డిసెంబరులో ఎన్నిక జరగాల్సివుండగా, అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మేయర్ స్రవంతి రాజీనామాతో ఉప ఎన్నిక నిర్వహించాల్సివచ్చింది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు నగరంలో 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి ఒక్కటి అంటే ఒక్క డివిజన్ దక్కలేదు. అయితే నాలుగేళ్ల తిరిగే సరికి రాజకీయం పూర్తిగా తలకిందులైంది. వైసీపీ తరపున గెలుపొందిన వారిలో 40 మంది టీడీపీలో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం, గతంలో వైసీపీలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు ముందే టీడీపీలో చేరి, మరోసారి ఎన్నిక అవడంతో నగరంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
నెల్లూరు సిటీతోపాటు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలవడంతో మేయర్ పదవి కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఇదేసమయంలో గతంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులుగా వ్యవహరించిన మాజీ మేయర్ స్రవంతి దంపతులు రాజకీయంగా శ్రీధర్ రెడ్డితో విభేదించడంతో కార్పొరేటర్ల అవిశ్వాసానికి గురయ్యారు. తొలుత పదవి నుంచి తప్పుకోవాలని టీడీపీలో చేరిన కార్పొరేటర్లు మాజీ మేయర్ స్రవంతిపై ఒత్తిడి చేయగా, ఆమె ససేమిరా అనడంతో గత నవంబరులో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. అయితే వైసీపీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగి టీడీపీలో చేరిన 6 కార్పొరేటర్లను వెనక్కి రప్పించడంతో నెల్లూరు రాజకీయం ఊహించని మలుపు తిరిగింది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ ఎంట్రీతో మేయర్ పదవిని వైసీపీ కాపాడుకునేలా కనిపించింది. అయితే అనిల్ కుమార్ రాజకీయాన్ని ఒక్క రోజులోనే టీడీపీ నేతలు చిత్తు చేశారు. వైసీపీకి వెళ్లిన నేతలు మళ్లీ వెనక్కి రావడంతో అవిశ్వాసం ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో గురువారం మేయర్ పదవికి ఎన్నిక నిర్వహించారు. వైసీపీకి తగిన బలం లేకపోవడంతో ఎన్నికను బహిష్కరించింది. ఫలితంగా టీడీపీ బలపరిచిన దేవరకొండ సుజాత మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో గత 20 నెలలుగా తీవ్ర ఉత్కంఠ రేపిన రాజకీయం చల్లబడినట్లైందని అంటున్నారు.


.jpeg)
