Ticker

6/recent/ticker-posts

అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: జిల్లా అటవీ అధికారి సందీప్ రెడ్డి


ఏలూరు, నవంబర్ 10: సహజ వనరులైన అడవులు, విలువైన వన్యప్రాణుల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలు ఎన్నటికీ మరువలేనివని జిల్లా అటవీ అధికారి పి.వి. సందీప్ రెడ్డి అన్నారు. మంగళవారం ఏలూరు అటవీ డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సందీప్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి అమరవీరుల స్మారక ఫలకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణులను స్మగ్లర్లు, అక్రమార్కుల నుంచి రక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంఘవిద్రోహ శక్తులను అడ్డుకుంటూ ప్రాణాలర్పించిన అటవీ సిబ్బంది త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా భావితరాలకు పచ్చని ప్రకృతిని, సమతుల్య పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఏలూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రాత్రింబగళ్లు అడవులను రక్షిస్తున్న సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. అటవీ రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు అటవీ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అటవీ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ, అడవుల విస్తరణకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

అనంతరం అధికారులు, సిబ్బంది అటవీ, వన్యప్రాణుల పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమరవీరుల సంస్మరణ బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, ఫారెస్ట్ బీట్ అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.