Ticker

6/recent/ticker-posts

పట్టిసీమతో రైతాంగానికి భరోసా.. పెదవేగి లిఫ్ట్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


జానంపేట (పెదవేగి), జూలై 12: రైతాంగం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేసిన సందర్భంగా ఆదివారం పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఆక్విడెక్ట్ వద్ద కూటమి నాయకులతో కలిసి గోదావరి తల్లికి పసుపు, కుంకుమలు సమర్పించి, కర్పూర హారతులతో జలహారతి నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని గోదావరి తల్లిని ప్రార్థించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, కృష్ణా డెల్టాకు సాగునీరు అందుతున్నదంటే 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న పట్టిసీమ ప్రాజెక్టు నిర్ణయమే కారణమని పేర్కొన్నారు. గత పదేళ్లుగా పట్టిసీమ ద్వారానే ఈ ప్రాంత రైతాంగం సాగు కొనసాగిస్తోందని, ఆ ప్రాజెక్టు రైతులకు జీవనాధారంగా నిలిచిందన్నారు.

పట్టిసీమ ప్రాజెక్టు లేకపోయి ఉంటే కృష్ణా డెల్టా చివరి ఆయకట్టు ప్రాంతమైన ఏలూరు రూరల్ పరిధిలో తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు గ్రామాలు విడిచి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేదని పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సోమవారం పోలవరం పర్యటనకు వచ్చే ముఖ్యమంత్రి దృష్టికి పెదవేగి మండలంలో ఆయిల్ పామ్, కొబ్బరి తోటలు ఎండిపోతున్న సమస్యను తీసుకెళ్తామని చెప్పారు.

అదే సమయంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే, అభివృద్ధి పేరుతో కేవలం ప్రకటనలకే పరిమితమై ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తాను గతంలో సాధించిన మంజూరులను తమ ఘనతగా ప్రచారం చేశారని విమర్శిస్తూ, పెదవేగి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రస్తుత శాసనసభ కాలంలోనే పూర్తి చేసి ప్రాంతానికి శాశ్వత సాగునీటి పరిష్కారం అందిస్తామని ప్రకటించారు. పెదవేగి, కూచింపూడి, న్యాయంపల్లి, రాట్నాలకుంట, రాయన్నపాలెం గ్రామాలకు నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించి రైతాంగాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గారపాటి రామసీత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బొప్పన సుధా, జలవనరుల శాఖ అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.