ఏలూరు/పోలవరం, జూలై 16: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో పాటు పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ముందుగా ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఇంజినీరింగ్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని ప్రజాప్రతినిధులకు వివరించారు. అనంతరం పవర్ హౌస్, అండర్‌స్లూయిస్ కాఫర్‌డ్యామ్, గ్యాప్-1 నుంచి గ్యాప్-11 వరకు, స్పిల్‌వే తదితర నిర్మాణ ప్రాంతాలను సందర్శించి పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనల ద్వారా పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులు వివరాలు అందించారు.
పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనులు ఆశించిన మేరకు ముందుకు సాగుతున్నాయని, ఇదే వేగంతో కొనసాగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ & ఎక్స్‌అఫీషియో జాయింట్ కలెక్టర్ వి. అభిషేక్, రంపచోడవరం ఐటీడీఏ పీవో ఎస్. ప్రశాంత్ కుమార్, ఇంజినీర్-ఇన్-చీఫ్ కె. నరసింహామూర్తి, పోలవరం ఇరిగేషన్ ఎస్‌ఈ ఆర్. రామచంద్రరావు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు బొల్లిన నిర్మల కిషోర్, గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సి.హెచ్. విక్రమ్ కిషోర్, ఇంజినీరింగ్ అధికారులు, బీజేపీ నాయకులు, కూటమి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

