ఏలూరు, జూలై 16: గోదావరి, కృష్ణా డెల్టాల శివారు భూములకు తక్షణమే సాగునీరు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు **కట్టా భాస్కరరావు** అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లాలోని రైతాంగ సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు **వి. కృష్ణయ్య**, జిల్లా ప్రధాన కార్యదర్శి **కె. శ్రీనివాస్** మాట్లాడుతూ, గోదావరి డెల్టా కాలువలకు జూన్ 1న ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం నారుమళ్లకు కూడా నీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కృష్ణా డెల్టా ప్రాంతానికి జూలై 1న నీరు విడుదల చేసినా ఇప్పటికీ సాగునీరు అందక పంట భూములు బీడుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని దెందులూరు, కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో వరి సాగుకు నీటి కొరత తీవ్రంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా కాలువల్లో సమృద్ధిగా నీరు ఉందని చెబుతున్నప్పటికీ, రైతుల పొలాలకు నీరు చేరడం లేదని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గోదావరి, కృష్ణా డెల్టాల శివారు భూములకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయిల్ పామ్ రైతుల సమస్యలను పరిష్కరించాలని, వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
అమెరికాతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం ఆ ఒప్పందంపై సంతకం చేయవద్దని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల **22న సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని** పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం సీనియర్ నాయకులు **జీవీ కృష్ణారావు**, జిల్లా ఉపాధ్యక్షుడు **కోన శ్రీనివాసరావు**, జిల్లా సహాయ కార్యదర్శి **బొడ్డు రాంబాబు**, జిల్లా కమిటీ సభ్యులు **గుర్రం రాంబాబు**, **వెలగలేటి మోహన్** తదితరులు పాల్గొన్నారు.

