Ticker

6/recent/ticker-posts

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..


TELANGANA, HYDERABAD, JUL 30: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజుల్లో మొత్తం రూ. 6,000 కోట్ల బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం మరో రూ. 2,000 కోట్లను విడుదల చేశారు. 


ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం మూడు విడతల్లో పూర్తి చేసింది. మొదటి విడతగా గత మే 29న రూ. 2,000 కోట్లు, రెండో విడతగా జూన్ 30న రూ. 2,000 కోట్లు విడుదల చేయగా, తాజాగా మూడో విడతగా మరో రూ. 2,000 కోట్లను విడుదల చేసి ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.

ఈ నిధుల విడుదలతో విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నీ పూర్తిగా చెల్లించబడ్డాయి. పదవీ విరమణ పొందిన సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మిగిలిన ఇతర బకాయిలను కూడా రాబోయే రోజుల్లో ఇదే రీతిలో క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 

ఆర్థిక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి బకాయిలు చెల్లించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, విశ్రాంత సిబ్బంది తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఉద్యోగ జేఏసీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.