ఏలూరు/బుట్టాయిగూడెం, జూన్ 19: బుట్టాయిగూడెంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుబ్బల మంగమ్మ అమ్మవారి దేవస్థానంను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, కమిషన్ సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఘన స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. గిరిజన మహిళలు, గిరిజన ప్రజలు సంప్రదాయ నృత్యాలతో చైర్మన్‌కు, సభ్యులకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడుతూ గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, గిరిజనుల అభ్యున్నతి మరియు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు.
ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యం గురించి ఆలయ నిర్వాహకులు వివరించడం సంతోషంగా ఉందన్నారు. దేవస్థాన అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి, గొర్లె సునీత, కె. రాములు నాయక్, ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు మరియు గిరిజన ప్రజలు పాల్గొన్నారు.

