దెందులూరు, మే 6: దెందులూరు ఎమ్మెల్యే Chintamaneni Prabhakar మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. బుధవారం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో పర్యటించిన ఆయన, ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన శ్రామికులతో ఆత్మీయంగా మమేకమై స్వయంగా పార పట్టి మట్టి పనిలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రామికులతో కలిసి పనిచేయడం అక్కడి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ శ్రామికుల పాత్ర ఎంతో విలువైనదని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి శ్రామికులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, వారి సంక్షేమం కోసం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
శ్రామికులతో కలిసి మట్టి పని చేసిన ఎమ్మెల్యేను చూసి కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని గుర్తించి తమ మధ్యకు వచ్చి పనిచేయడం తమకు ప్రోత్సాహాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సామాన్యుడిలా కలిసిపోవడం నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తీవ్రమైన వేసవి ఎండల నేపథ్యంలో శ్రామికుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. పని ప్రదేశాల్లో తాగునీరు, అవసరమైన సదుపాయాలు కల్పించి డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యవేక్షకులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు.

