Ticker

6/recent/ticker-posts

మెప్మా ఆర్పీలకు పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలి: ఐఎఫ్‌టీయూ


ఏలూరు, మే 6: మెప్మా ఆర్పీలకు పిఆర్సీకి అనుగుణంగా వేతనాలు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని ఐఎఫ్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు నగర మెప్మా ఆర్పీల సంఘం ప్రతినిధులు మెప్మా జిల్లా పీడీ రాజబాబు, సిఎంఎం ఝాన్సీకి వినతిపత్రం సమర్పించారు.


ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షుడు బి. సోమయ్య మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో ప్రస్తుతం ఆర్పీలకు ఇస్తున్న రూ.10 వేల జీతం సరిపోవడం లేదన్నారు. అంతేకాక జీతాలు కూడా సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిఆర్సీ ప్రకారం కనీస వేతనాలు అమలు చేసి ఆర్పీలకు ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు.

ఆర్పీలకు గుర్తింపు కార్డులు, యూనిఫారాలు అందించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ సౌకర్యాలు అమలు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. యాప్‌ల ద్వారా అధిక పని భారం పెరుగుతోందని, ఓటీపీ ఆధారిత పనుల ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

యూనియన్ అధ్యక్షురాలు ఎ. ఇందిరాదేవి మాట్లాడుతూ ఆర్పీలు ప్రజలకు సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తగిన గుర్తింపు మరియు సౌకర్యాలు అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఆర్పీల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సరళ, ఉషారాణి, జయలక్ష్మి, కళ్యాణి, జయ వెంకటరమణ, వెంకటరమణ, రాజేశ్వరి, భారతి, మమత, శ్యామల, హేమలత తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన మెప్మా జిల్లా పీడీ రాజబాబు మాట్లాడుతూ తమ పరిధిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, మిగిలిన అంశాలను ప్రభుత్వం మరియు మెప్మా ఎండీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.