Ticker

6/recent/ticker-posts

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు, మే 11: ప్రజల నుంచి అందుతున్న ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఒకసారి పరిష్కారం కోసం వచ్చిన అర్జీ మళ్లీ అదే సమస్యపై రెండోసారి రాకుండా చర్యలు తీసుకోవాలని, అలాంటి పరిస్థితులు తలెత్తితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరం లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఇన్‌చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎల్. దేవకీదేవి, ఇన్‌చార్జ్ ఆర్డీవో ఐ. కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వచ్చిన అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. సమస్య పరిష్కారం సాధ్యం కాని పరిస్థితుల్లో కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మొత్తం 273 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. వివిధ భూ వివాదాలు, విద్యుత్ కనెక్షన్లు, సర్వే లోపాలు, స్థల వివాదాలు, స్మశానవాటిక ఆక్రమణలు వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో కొనుగోలు చేసిన స్థలంపై న్యాయం చేయాలని విజయవాడ రూరల్‌కు చెందిన కె.ఆర్. కోటేశ్వరరావు అర్జీ సమర్పించగా, చింతలపూడికి చెందిన దుగ్గిరాల దీప్తి భూమి సర్వేలో లోపాలు సరిచేయాలని కోరారు.

అదేవిధంగా కుక్కునూరు మండలం పుల్లప్పగూడెంకు చెందిన కుంజ ముత్తయ్య గ్రామ స్మశానవాటిక భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చాట్రాయి మండలం ఆరుగల్లుపేటకు చెందిన సాధు బాబురావు ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో ఎన్.వి. నాంచారయ్య, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.