Ticker

6/recent/ticker-posts

మహిళలపై నేరాలకు కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ శ్రీనివాస్


ఏలూరు, మే 8: మహిళలపై జరిగే నేరాల నివారణ, రక్షణ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెదపాడు పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు పెదవేగి ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ రామచంద్రపురం గ్రామంలో మహిళలకు అవగాహన కల్పించారు.


ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, దాడులు, మర్యాదకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే నూతన చట్టాల ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, నిర్ణీత కాలవ్యవధిలో విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, బాలికలు ఉపయోగించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. 112 పోలీస్ ఎమర్జెన్సీ సేవలు, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, 181 మహిళా హెల్ప్‌లైన్, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ల ప్రాధాన్యతను వివరించారు.

ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్‌లో “శక్తి యాప్” తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్నప్పుడు ఒక్క క్లిక్‌తోనే పోలీస్ సహాయం పొందవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా వేధింపులు, ఆర్థిక మోసాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మహిళలు తమ హక్కులను తెలుసుకుని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఫిర్యాదు చేసిన మహిళల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఎస్ఐ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, చట్టాలపై అవగాహన ప్రతి ఒక్కరికీ రక్షణగా నిలుస్తుందని ఎస్ఐ పేర్కొన్నారు.