ఎన్టీఆర్ జిల్లా, మే 9: రాష్ట్ర రైతాంగానికి మేలు చేసే దిశగా తొలిసారిగా బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
శనివారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన మంత్రి రామవరప్పాడు విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్ కార్యాలయం, గొల్లపూడి ఆర్ఎస్కే కేంద్రాలను సందర్శించి రబీ ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యంలో తేమ శాతం తనిఖీ విధానాన్ని స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత 30 నిమిషాల నుంచి 17 గంటల వ్యవధిలోనే నగదు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని మంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, తేమ శాతం అధికంగా ఉండడం, గోతాలలో రంధ్రాలు ఉండడం వంటి అంశాలను గుర్తించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో లారీలు, గోతాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తేమ శాతం కొలిచే యంత్రాలను పూర్తిగా బ్లూటూత్ సాంకేతికతతో వినియోగించాలని సూచించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ ఏడాది రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే 17.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ రబీ సీజన్‌లో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.4,410 కోట్లు జమ చేశామని, అందులో 94 శాతం చెల్లింపులు 24 గంటల లోపే పూర్తి చేశామని వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లాలో గత ఏడాది 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈసారి ఇప్పటికే 80 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయ్యిందన్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 60 శాతం అధికమని పేర్కొన్నారు. రైతుల సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందం పనిచేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఢిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, పౌరసరఫరాల శాఖ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

