ఏలూరు, మే 9: చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో మహిళలకు ఘనంగా పసుపు-కుంకుమ కానుకలు పంపిణీ చేశారు. శ్రీ మదనగోపాల స్వామి ఆలయం పునఃప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గ్రామ ఆడపడుచులకు చీరలు, మామిడి పండ్లు, తాంబూలంతో కూడిన కానుకలు అందజేసి ఎమ్మెల్యే మరోసారి తన ఆప్యాయతను చాటుకున్నారు.
శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది మహిళలకు సంప్రదాయబద్ధంగా కానుకలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా ప్రతి మహిళను పేరుపేరునా పలకరిస్తూ చీరలు, తాంబూలం, మామిడి పండ్లతో కూడిన కిట్‌లను అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ మహిళలు ఎమ్మెల్యేను సొంత అన్నలా భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
కానుకలు అందుకున్న మహిళలు మాట్లాడుతూ పండుగ సందర్భంగా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాజకీయ నాయకుడిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా గ్రామ ప్రజలతో మమేకమవుతున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ప్రశంసించారు. తమ కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తిగా ఆయనపై గ్రామ మహిళలకు ప్రత్యేకమైన అభిమానం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవ చేయడమే తమ లక్ష్యమన్నారు. మహిళల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఆధ్యాత్మిక వేడుకల్లో గ్రామ మహిళలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి రాధారాణి, కుమార్తెలు నవ్యశ్రీ, ప్రణయత పాల్గొని మహిళలకు పసుపు-కుంకుమ కానుకలు పంపిణీ చేశారు. గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

