Ticker

6/recent/ticker-posts

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణలు: కలెక్టర్ లక్ష్మీశ


ఎన్‌టీఆర్ జిల్లా, మే 9: స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. గొల్లపూడిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం మహిళలకు పుట్టగొడుగుల పెంపకం, డిజైనింగ్ వస్త్రాల తయారీపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే ఉత్తమ స్వయం ఉపాధి అవకాశమని తెలిపారు. గ్రామీణ మహిళలు ఇంటి వద్ద నుంచే ఈ సాగును చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యకర ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నందున మార్కెట్‌లో పుట్టగొడుగులకు మంచి డిమాండ్ ఉందన్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలు సంప్రదాయ ఉపాధి మార్గాలతో పాటు ఆధునిక వ్యవసాయ ఆధారిత ఉపాధి రంగాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, ప్రోత్సాహక పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. మహిళలు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

ఈ సందర్భంగా ఆంత్రప్రెన్యూర్ నాగరాజు మహిళలకు పుట్టగొడుగుల పెంపక విధానం, అవసరమైన ముడి పదార్థాలు, నిర్వహణ పద్ధతులు, మార్కెటింగ్ అవకాశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. తక్కువ స్థలంలో కూడా పుట్టగొడుగుల సాగు చేయవచ్చని, దీని ద్వారా నెలకు మంచి ఆదాయం పొందే అవకాశముందని వివరించారు.

అదేవిధంగా లలిత్ ప్రింట్ సంస్థకు చెందిన హైమావతి మహిళలకు డిజైనింగ్ వస్త్రాల తయారీపై ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, మహిళా సంఘాల సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.