ఏలూరు, మే 7: గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు Alluri Sitarama Raju ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ఆర్.ఆర్.పేటలోని స్ఫూర్తి భవన్‌లో గురువారం నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా “జోహార్ అల్లూరి సీతారామరాజు – సాధిస్తాం అల్లూరి ఆశయాలు” అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ మాజీ పట్టణ కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలన, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత నాయకుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అక్షరాస్యత లేని గిరిజనులను కూడగట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములను చేసిన గొప్ప నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. అల్లూరి చూపిన పోరాట స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు కొత్త ఉత్తేజాన్ని నింపారని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నిర్వహించడమే అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, గొర్లి స్వాతి, తమ్మిశెట్టి రమణయ్య, బళ్ల కనకదుర్గారావు, బుగ్గల ప్రభాకర్, ఎం.ఏ. హకీమ్ తదితరులు పాల్గొన్నారు.

