Ticker

6/recent/ticker-posts

ఎండల నుంచి రిలీఫ్.. మేఘావృత వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలు..


ANDRAPRADESH, MAY, 09: ఎండవేడిమి, ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఊరట కలిగించే వార్త వినిపించింది. ఆదివారం రోజున ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


వానలకు తోడుగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, పోలవరం జిల్లాలోని గుర్తేడు, అనకాపల్లి జిల్లాలోని కె. కోటపాడు మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం,చీడికాడ, చోడవరం, దేవరపల్లి, మాడుగుల, పరవాడ మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో.. పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం
మరోవైపు మే 12 లేదా13వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ తెలిపింది. ఈ అల్పపీడనం తర్వాత వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే కర్ణాటక, రాయలసీమ ద్రోణి విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో మంగళవారం వరకూ రాష్ట్రంలో మేఘావృత వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.