Ticker

6/recent/ticker-posts

ఏపీలోని ఆ హైవేలో టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలు ఆగకుండా వెళ్లొచ్చు.. మూడు జిల్లాల్లో మల్టీలేన్‌ ఫ్రీ ఫ్లో


ANDRAPRADESH, MAY, 09: నేషనల్ హైవేలపై ప్రయాణించే సమయంలో వాహనాలు టోల్‌ప్లాజాల దగ్గర ఆగాల్సిందే.. ఫీజు చెల్లించాల్సిందే. ఇకపై హైవేలలో టోల్‌ప్లాజాల దగ్గర ఆగకుండా ముందుకు వెళ్లిపోయేలా బారియర్లు లేని టోల్‌ప్లాజాలు త్వరలో రాబోతున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు (వయా కర్నూలు, అనంతపురం) నేషనల్ హైవే 44లో ఏపీలో మూడుచోట్ల బారియర్లు లేని టోల్‌ప్లాజాలను ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఏర్పాటు చేయనుంది. ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్‌ (మల్టీలేన్‌ ఫ్రీ ఫ్లో)గా ఈ విధానాన్ని పిలుస్తున్నారు.. ఈ కొత్త విధానాన్ని దశలవారీగా అన్ని టోల్‌ప్లాజాల్లో ఏర్పాటు చేయనున్నారు.


హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే 44లో.. ఏపీ పరిధిలోని కర్నూలు జిల్లా అమకతాడు, అనంతపురం జిల్లా కాసేపల్లి, శ్రీసత్యసాయి జిల్లా మరూరు టోల్‌ప్లాజాల్లో అమలు చేయనున్నారు.. ఈ బాధ్యతలు ఓ ఏజెన్సీకి అప్పగించారు. ఈ కొత్త విధానంలో టోల్‌ప్లాజా దగ్గర ఓ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ వాహనాల నంబర్ ప్లేట్‌ను రీడ్ చేసే ఏఎన్‌పీఆర్‌ (ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌) కెమెరాలతో పాటుగా ఆర్‌ఎఫ్‌ఐడీ ఫాస్టాగ్‌ రీడర్‌నూ ఏర్పాటు చేస్తారు. వాహనాలు టోల్‌ప్లాజా దగ్గరకు రాగానే ఏఎన్‌పీఆర్‌ కెమెరాతో నంబరు ప్లేట్‌ను గుర్తిస్తుంది. ఈ వాహనంపై ఫాస్టాగ్‌నూ రీడ్‌ చేసి, వ్యాలెట్‌ నుంచి టోల్‌ ఫీజు కట్ చేయడం సెకన్లలోనే పూర్తవుతుంది. ఈ కొత్త విధానంతో టోల్‌ప్లాజాల దగ్గర వాహనం ఆగకుండా వెళ్లొచ్చు.

ఒకవేళ ఈ కొత్త విధానంలో వాహనానికి ఫాస్టాగ్‌ లేకపోయినా.. ఒకవేళ ఫాస్టాగ్‌ వ్యాలెట్‌లో డబ్బులు లేకపోయినా ఇబ్బందులు తప్పవు. టోల్‌ప్లాజా దగ్గర ఇలాంటి వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్‌ను గుర్తించి ఎలక్ట్రానిక్‌ నోటీసు జారీచేస్తారు. ఆ తర్వాత 72 గంటల్లో టోల్‌ఫీజు చెల్లించాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఆ డబ్బులు చెల్లించకపోతే రెట్టింపు టోల్‌ఫీజు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఏపీ పరిధిలో మూడుచోట్ల ఏర్పాటు చేస్తుండగా.. మరో మూడుచోట్ల కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16లోని గుంటూరు జిల్లా కాజ, విజయవాడ బైపాస్‌లో వెంకటపాలెం, వెదురుపావులూరు టోల్‌ప్లాజాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2027 నాటికి రాష్ట్రంలోని నాలుగు, ఆరు లైన్ల హైవేల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.