Ticker

6/recent/ticker-posts

దెందులూరులో ‘చింతమనేని ప్రీమియర్ లీగ్’కు శ్రీకారం


రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


దెందులూరు, మే 7: యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు, ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దెందులూరులో ‘చింతమనేని ప్రీమియర్ లీగ్ (CPL)’ పేరుతో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గురువారం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో CPL పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు జట్టు భావన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి దెందులూరు హైస్కూల్ గ్రౌండ్‌లో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు ముందుకొచ్చిన రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పెనుబోయిన మహేష్ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్రంలోని ఏ క్రికెట్ జట్టైనా ఈ టోర్నమెంట్‌లో పాల్గొనవచ్చని ఎమ్మెల్యే వెల్లడించారు. విజేతలకు భారీ నగదు బహుమతులు, ఆకర్షణీయమైన ట్రోఫీలు అందజేయనున్నట్లు చెప్పారు. మొదటి బహుమతిగా రూ.1,11,111, రెండో బహుమతిగా రూ.55,555 ఇవ్వనున్నట్లు తెలిపారు. అదనంగా బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ బౌలర్, హ్యాట్రిక్ సాధించిన ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పోటీల్లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మరిన్ని వివరాల కోసం 6300598229, 9885509845 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, విద్య, వైద్యం, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దెందులూరు ఏఎంసీ చైర్‌పర్సన్ గారపాటి రామసీత, కూటమి నాయకులు ఇప్పిలి వెంకటేశ్వరరావు, కొనకళ్ల శివమణి, తానంకి సురేష్, సీపీఎల్ నిర్వహక బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.