Ticker

6/recent/ticker-posts

దుగ్గిరాల మదనగోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని దంపతులు


దెందులూరు, మే 7: పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని శ్రీ మదనగోపాల స్వామి ఆలయం ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సతీమణి చింతమనేని రాధారాణితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామివారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మే 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పునఃప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం భక్తుల కోసం భారీ అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని కోరారు.

ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన జీవన విధానం సమాజానికి ప్రశాంతతను తీసుకువస్తుందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.