ANDRAPRADESH, MAY, 09: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సూపర్ సిక్స్, సంక్షేమ పథకాలపై సమీక్షించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దివ్యాంగ శక్తి, స్త్రీశక్తి, దీపం 2.O పథకాలకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల (మే) 19న మత్స్యకారుల సేవలో కింద రూ.286 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద 67లక్షలమంది విద్యార్థులకు రూ.10వేల కోట్లు ఇస్తున్నామన్నారు. దీపం 2.O పథకం కింద 1.08 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని.. ఇప్పటి వరకు మొత్తం రూ.3,504 కోట్లు ఖర్చు చేశామన్నారు. స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా 60.6 కోట్ల ప్రయాణాలు చేస్తే.. ఏడాదికిరూ.1,940 కోట్లు ఖర్చవుతున్నట్లు తెలిపారు.
గతేడాది నుంచి అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇమామ్, మౌజన్లకు, పాస్టర్లకు గౌరవ వేతనం పెండింగ్ లేకుండా చూడాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు పావలా వడ్డీకే రుణం అందించేలా చూడాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఐఐటీ ర్యాంకులు సాధించేలా ప్రోత్సహించాలని.. అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్యం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు సెర్ప్, మెప్మా ద్వారా రూ.5 లక్షలతో యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు చంద్రబాబు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ గురుకాల్లో కూరగాయలు పండించేలా చూడాలని సూచనలు చేశారు. రాష్ట్రంలో గురుకులాలను ఐఐటీ, నీట్ కేంద్రాలుగా మార్చాలని.. వీటిని కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే గీతం యూనివర్శిటీ 500మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ యువతకు జర్మన్ భాష నేర్పిస్తున్నామని.. విదేశాల్లో ఉద్యోగాలు దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.
జిల్లాల్లో గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించేందుకు అత్యవసర నిధులు లేవని కలెక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ద్వారా మరమ్మతులు చేయాలని సూచించారు. అలాగే కొత్త జిల్లాలకు సంబంధించి అధికారులకు జీతాల సమస్య గురించి ప్రస్తావించగా.. వెంటనే జీతాలు అందేలా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు. అంతేకాదు కలెక్టర్లు వినతులు తీసుకుంటున్నా పరిష్కారం విషయంలో జాప్యం జరుగుతోందన్నారు చంద్రబాబు. ప్రతి సోమవారం ప్రజాదర్బార్‌తో పాటుగా ప్రతి శుక్రవారం (నెలలో నాలుగు సార్లు) ఓ నియోజకవర్గంలో సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. ఇలా చేస్తే అక్కడ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

