ఏలూరు, మే 9: పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం లో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం నిర్వహించే గిరి ప్రదక్షిణతో పాటు భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఉత్తర భాగంలో ఉన్న ఏడుకొండలలో ఆరో కొండపై పారిజాత వృక్షాల మధ్య వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
శనివారం ఉదయం వేళ 4.30 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్టి, బాలభోగ నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులకు అవకాశం కల్పించారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు “గోవిందా.. గోవిందా” నామస్మరణల మధ్య వరాహస్వామి ఆలయం నుంచి కాలినడకన ఏడుకొండలు అధిరోహించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
భక్తులు ప్రత్యేక దర్శనాలు, అష్టోత్తర పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని బుట్టాయిగూడెంకు చెందిన వాసు, గద్దె మురళీకృష్ణ, గద్దె సత్యనారాయణ, ఇమ్మని రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి ఋషికేశ్ ఆచార్యులు, కుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు అన్నదాతలను స్వామివారి ప్రసాదాలతో సత్కరించారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయని తెలిపారు. పూజా టిక్కెట్లు, ప్రసాద విక్రయాలు, అన్నదాన విరాళాలు మరియు ఇతర కానుకల రూపంలో ఈరోజు ఆలయానికి రూ.1.45 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

