Ticker

6/recent/ticker-posts

జైనవారిగూడెంలో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం


ఏలూరు, మే 9: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని జీలుగుమిల్లి పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు జీలుగుమిల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో బుట్టాయిగూడెం ఎస్సై చెన్నారావు సిబ్బందితో కలిసి బుట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం గ్రామంలో గురువారం రాత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.


ఈ సందర్భంగా ఎస్సై చెన్నారావు గ్రామ ప్రజలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో తలెత్తే చిన్నపాటి వివాదాలను గ్రామ పెద్దల సహకారంతో పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ప్రస్తుతం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాపాయాలను నివారించవచ్చని వివరించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, ఓటీపీ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి హానికరమైన నాటు సారా తయారీ, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఎక్కడైనా నాటు సారా తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్సై చెన్నారావు తెలిపారు.