ANDRAPRADESH, MAY, 08: బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్.సవిత నేతృత్వంలో బీసీ బిడ్డలకు విద్యతో పాటు ఆరోగ్య భద్రత, నాణ్యమైన ఆహారం అందిస్తోంది. ప్రభుత్వమందించిన ప్రోత్సాహంతో ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో బీసీ బిడ్డలు అత్యున్నతమైన ఫలితాలు సాధించడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజక వర్గంలో వెనుకబడిన తరగతి విద్యార్థులందరికీ విద్య అందేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నియోజక వర్గంలో కొత్తగా మూడు బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరిగి, రొద్దం, సోమందేపల్లిలో ఏర్పాటు చేయబోయే ఈ బీసీ హాస్టళ్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది. పరిగి, రొద్దంలో బాలికల హాస్టళ్లను, సోమందేపల్లిలో బాలుర హాస్టల్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు హాస్టళ్ల నిర్వహణకు హెచ్.డబ్ల్యూ.వో.లను(వార్డెన్లు) నియమించే పనిలో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులు తలమునకలయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే హాస్టళ్లలో బీసీ విద్యార్థులు చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో 61 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. పెనుకొండ నియోజ వర్గంలో నాలుగు బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో రెండు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు కాగా, మరో రెండు ప్రీ మెట్రిక్ హాస్టళ్లు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే మూడు హాస్టళ్లను కలిపి జిల్లాలో హాస్టళ్ల సంఖ్య 64కు చేరుకోనుంది.
వార్డెన్ల నియామకానికి కసరత్తు
వచ్చే నెలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో, కొత్తగా ఏర్పాటుచేయబోయే హాస్టళ్లలో హెచ్.డబ్ల్యూ.వో.లను(వార్డెన్లు) నియామకానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులు చర్యలు ప్రారంభించారు. తమ శాఖలో సిబ్బంది కొరత కారణంగా, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులను నియమించాలని ఆ శాఖ జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు ఓ లేఖను సైతం జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారులు రాశారు. హెచ్.డబ్ల్యూ.వో.ల (వార్డెన్లు) నియామకంపై ఇతర శాఖల అధికారులకు లేఖ రాశారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలనకు, హెచ్.డబ్ల్యూ.వోల నియామకానికి ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. కొద్ది రోజుల్లోనే హెచ్.డబ్ల్యూ.వోల నియమించేలా బీసీ సంక్షేమశాఖాధికారులు చర్యలు ప్రారంభించారు.
హాస్టళ్ల మంజూరులో ఫలించిన మంత్రి సవిత కృషి
నియోజక వర్గంలో బీసీ విద్యార్థులకు ఉన్నతవిద్య అందించాలన్న లక్ష్యంతో మంత్రి సవిత పనిచేస్తున్నారు. పేదలు, కూలీల పిల్లలు విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నియోజక వర్గంలో కొత్తగా మూడు బీసీ హాస్టళ్లు ఏర్పాటు చేసేలా మంత్రి సవిత కృషి చేశారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, పేదరికంతో బీసీ బిడ్డల డ్రాపౌట్లు పెరుగుతున్నాయని వివరించారు. ఉన్నత విద్య చదవాలని ఉన్నా పేదరికం కారణంగా మరికొందరు బడి బయటే ఉండిపోతున్నారని తెలిపారు. మంత్రి సవిత వినతిని మన్నించి, పెనుకొండ నియోజక వర్గంలో మూడు బీసీ హాస్టళ్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే పరిగి, రొద్దం, సోమందేపల్లిలో బీసీ హాస్టళ్లలో విద్యార్థులను చేర్చించడానికి బీసీ సంక్షేమ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులను గుర్తించి, బీసీ హాస్టళ్లలో చేర్పించాలని జిల్లాలో మండల విద్యాశాఖాధికారులను, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కోరారు. పేద, వలస కూలీల పిల్లలతో పాటు హాస్టళ్లలో ఉంటూ చదువుకోవాలని ఆస్తకి చూపే బీసీ విద్యార్థులను ఈ మూడు హాస్టళ్లలో చేర్పించేలా కృషి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, తమ బిడ్డలను బీసీ హాస్టళ్లలో చేర్పించాలని కోరుతున్నారు.

