ANDRAPRADESH, MAY, 08: అమరావతి వేదికగా జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమంపై దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులు, సామాజిక వర్గాల సాధికారతపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. 2027 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఉండాలనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్లకు సూచించారు.
గృహ నిర్మాణమే లక్ష్యం - ఆగస్టు 15న మెగా ఈవెంట్
రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2027 డిసెంబర్ నాటికి అదనంగా మరో 10 లక్షల ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇందుకోసం సుమారు 2 లక్షల మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు అవసరమవుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు కేటాయించాలని ఆదేశించారు.
క్రమబద్ధీకరణ ద్వారా వేలాది మందికి ఊరట
ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఒక్క విజయవాడలోనే 60 వేల మందికి, విశాఖపట్నంలో 30 వేల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. ఈ విషయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, వాటిని వెంటనే క్యాబినెట్ ఆమోదానికి పంపాలని, సామాన్యుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్లకు భరోసా ఇచ్చారు. అలాగే గుంటూరులో పెండింగ్‌లో ఉన్న 22ఏ భూముల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
బుడగ జంగాలకు ఎస్సీ ఫలాలు - బీసీలకు రిజర్వేషన్లు
సామాజిక న్యాయం దిశగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చడంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని, అయితే కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు వారికి ఉద్యోగ మినహా ఎస్సీలకు అందే అన్ని ఇతర సంక్షేమ ఫలాలను వర్తింపజేయాలని ఆదేశించారు. బీసీల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీ హాస్టళ్ల రూపురేఖలు మార్చేలా ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.
మైనారిటీలకు ఆటోనగర్లు - ఉపాధి హబ్‌లు
మైనారిటీల ఆర్థికాభివృద్ధికి సంబంధించి సీఎం సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో రూరల్ ఆటోనగర్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిని వక్ఫ్ బోర్డు భూముల్లో నిర్మించి, మైనారిటీ యువతకు లైవ్ లీ హుడ్ హబ్ లుగా మార్చడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడాలని అధికారులను ఆదేశించారు. ముస్లిం మైనారిటీల నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకునేలా ఈ పారిశ్రామిక వాడలను తీర్చిదిద్దాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
సమ్మర్ ప్లాన్ , కేంద్ర పథకాల అనుసంధానం
వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా 'సమ్మర్ యాక్షన్ ప్లాన్'పై సీఎం సమీక్షించారు. జలధార, పశుగ్రాసం వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసి గరిష్ట ప్రయోజనం పొందాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పరిపాలనలో పారదర్శకతను పాటిస్తూ నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

