Ticker

6/recent/ticker-posts

జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మనోహర్‌ సూచన


అమరావతి: ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పని చేయాలని మంత్రి మనోహర్‌ సూచించారు. సోమవారం అసెంబ్లీలోని జనసేన పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో ఆయన భేటీ అయ్యారు. శాసనసభ, మండలి జరుగుతున్న తీరు, పార్టీ ప్రజాప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలు, పాల్గొంటున్న సభ్యులు, చట్టసభల్లో అనుసరించబోయే వ్యూహం గురించి చర్చించారు. 


సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, ప్రసార మాధ్యమాలతో మాట్లాడే సమయంలో పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తూనే, వైసీపీ కులాల మధ్య పెడుతున్న చిచ్చు.. కుట్రలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, పరిష్కరించేలా చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెల 26 నుంచి పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుందని, ప్రతి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించాలని చెప్పారు.