Ticker

6/recent/ticker-posts

సొంతింటి నిర్మాణానికి బాలయ్య భూమిపూజ


హిందూపురం: నా కేరాఫ్‌ హిందూపురమే అంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం హిందూపురం పట్టణం వన్నమ్మ కాలనీలో సొంతింటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ క్రతువులో ఎమ్మెల్యే బాలకృష్ణ, సతీమణి వసుంధరతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దైవాంశసంభూతుడు, తన తండ్రి నందమూరి తారకరామారావును నియోజకవర్గం ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలిపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించారన్నారు. 


ఆయన కుమారుడిగా, వారసుడిగా తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అలాంటి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఈ సొంతింటి నిర్మాణానికి పూనుకొన్నానని పేర్కొన్నారు. తన చిరకాల వాంఛ తీరుతున్న వేళ ఎంతో సంతోషంగా ఉందని, ఇంతటి ఆదరాభిమానాలు చూపుతున్న నియోజకవర్గాన్ని ఘనంగా అభివృద్ధి చేయాలన్నదే తన ఆశయమన్నారు. అందుకే అనేక పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి, ఏపీ టెక్నికల్‌ సర్వీసెస్‌ ఛైర్మన్‌ మన్నవ మోహనకృష,్ణ తెదేపా రాష్ట్ర కార్యదర్శి దోణి శ్రీనివాసమూర్తి, స్థానిక తెదేపా నాయకులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.