Ticker

6/recent/ticker-posts

విజయ్ టీవీకే... ఏపీలోనూ ప్రకంపనలు


TAMILANADU, MAY, 06: సహజంగా కొత్త రాజకీయ పార్టీ విజయంతో అనేక రకాలుగా చర్చలు సాగుతాయి. ఇపుడు పొరుగున ఉన్న తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీని స్థాపించి తొలి ప్రయత్నంలోనే అధికారం అందుకుంటున్నారు. దాంతో దాని ప్రభావం ఏపీలోనూ ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఏమిటి ఎలా ఉండబోతోంది అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. విజయ్ టీవీకే పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఐకాన్ గా మారడంతో పాటు ఆయన పార్టీ ఎక్కువగా దళితుల గురించి ఆలోచన చేస్తుందని వార్తలు వ్యాప్తి చెందడంతో ఏపీలో ఆయా సామాజిక వర్గాలలో కదలిక మొదలైంది అని అంటున్నారు. 


బీఎస్పీ తరహాలో : ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం యూపీలో బహుజన సమాజ్ వాదీ పార్టీని పెట్టి మాయావతి భారీ ఎత్తున సామాజిక ప్రయోగం చేశారు. దేశంలో పెద్ద రాష్ట్రం అయిన యూపీలో దళితులకకు రాజ్యాధికారం కలను సాకారం చేసిన బీఎస్పీ కాలక్రమంలో ఆ తరహా సోషల్ ఇంజనీరింగ్ ని దేశవ్యాప్తం చేయడం ద్వారా దళిత ప్రధాని కేంద్రంలో అధికారం చేపట్టేలా బాటలు వేయాలనుకున్నారు. దాంతో బీఎస్పీ జాతీయ పార్టీగా తన వ్యూహాలను రచించింది. చాలా రాష్ట్రాలలో బీఎస్పీ శాఖలు ఏర్పడ్డాయి. మాయావతి అణగారిన వర్గాలకు ఒక కేంద్ర బిందువుగా మారారు. ఏపీలోనూ బీఎస్పీ సామాజిక పునాదుల మీద రాజకీయ భవనాలు కట్టవచ్చు అన్న ఆశలు ఆరాటాలు అప్పట్లో మొదలయ్యాయి. అయితే తరువాత కాలంలో ఆమె రాజకీయ ప్రభ యూపీలోనే కనుమరుగు కావడంతో బీఎస్పీకి ఆదరణ అంతటా తగ్గింది. ఇపుడు యూపీలోనే బీఎస్పీ ఉనికి పాట్లు పడుతోంది. 

ఆప్ క్రేజ్ లోనూ : ఇక ఇదే విధంగా మరో సందర్భంలో ఢిల్లీ కేంద్రంగా కొత్త పార్టీగా ఆప్ అవతరించింది. పార్టీ పెట్టిన పదమూడు నెలలలోనే ఆప్ అధికారంలోకి రావడంతో అది దేశ వ్యాప్త సంచలనం అయింది. అవినీతికి వ్యతిరేకంగా యూత్ మధ్యతరగతి మద్దతుతో ఆప్ చేసిన ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ కావడంతో దేశంలోనూ ఆ ప్రభావం కనిపించింది. అన్ని చోట్లా ఆప్ శాఖలు ఏర్పాటు అయ్యాయి. ఈ పరిణామంతో ఏపీలోనూ ఆప్ ప్రభావం ఉంటుందని అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించింది. ఆప్ యువతని ఆకట్టుకుని ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అవుతుందని కూడా లెక్క కట్టారు. కానీ తరువాత కాలంలో ఏమీ జరగలేదు. 

టీవీకే గురించి : ఇపుడు చూస్తే టీవీకే గురించి కూడా అదే రకమైన చర్చ సాగుతోంది. తమిళనాడులో అధికారం అందుకుంటున్న టీవీకే తన ఫిలాసఫీతో దళితులు బడుగులు యువత జెన్ జీ నినాదంతో ఏపీలోనూ ఏమైనా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందా అన్న చర్చకు తెర లేస్తోంది ఏపీలో చూస్తే పెద్ద ఎత్తున దళితులు ఉన్నారు. తమిళనాడు కంటే కూడా ఎక్కువగా ఉన్నారు. అంతే కాదు ఏపీలో రాజకీయ శూన్యత ఉందని అంటున్న వారూ ఉన్నారు. విజయ్ కి ఏపీలోనూ సినీ గ్లామర్ ఉంది, దాంతో పాటు వైసీపీ 2024 ఎన్నికల్లో భారీ ఓటమి తరువాత చతికిలపడి పోయింది. దాంతో ఆ పార్టీలో కూడా అసంతృప్తిపరులు అనేకమంది సరైన రాజకీయ వేదిక కోసం చూస్తున్నారు అన్న ప్రచారం ఉంది. 

అలాగే ఇతర పార్టీలలో చాన్స్ లేని వారు అంతా కొత్తగా టీవీకే తన రాజకీయాన్ని ఏపీలో స్టార్ట్ చేస్తే వీరంతా పోలరైజ్ అయి అందులోకి వస్తారు అని అంటున్నారు. దీని వెనక ఒక టాలీవుడ్ నిర్మాత సంధాన కర్తగా మారి మొత్తం వ్యవహారం చూస్తున్నారు అని అంటున్నారు. ముందు తమిళనాడులో కుదురుకుని ఏపీకి విజయ్ వస్తారని ఏపీలో రాజకీయాల పట్ల మంచి అవగాహన ఉనన్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇపుడు టీవీకే వెన్|ట ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరిగేవేనని అంటున్నారు. 

రాజకీయాల్లో ఏమైనా : అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. యూపీ ఏపీకి దూరంగా ఉంది కాబట్టి బీఎస్పీ ప్రయత్నాలు ఇక్కడ సఫలం కాలేదు, ఢిల్లీ నుంచి ఆప్ చేసిన ఆలోచనలూ అందుకే ఆగిపోయాయని అంటున్నారు. విజయ్ అలాంటి వారు కాదు పొరుగునే ఉన్నారు పైగా ఆయన సినిమాల పరంగా ఏపీకి కూడా పరిచయమే. దాంతో ఏపీలో సామాజిక రాజకీయ పునరేకీకరణ విజయ్ టీవీకే కనుక అక్కడకు విస్తరిస్తే జరిగే వీలుందా అంటే ఏమో జరిగేందుకు అయితే ఆస్కారం ఉందని దాని ప్రభావం ఎంతో కొంత ఉండొచ్చు అన్న చర్చ అయితే ఉంది మరి.