“మా స్కూల్లో చదివితే మెరుగైన భవిష్యత్” అంటూ తల్లిదండ్రులకు అవగాహన
అమలాపురం, మే 7: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు గురువారం గ్రామాల్లో పర్యటిస్తూ పాఠశాల ప్రత్యేకతలు, పదో తరగతి ఫలితాలను తల్లిదండ్రులకు వివరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భమిడిపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో చెముడులంక, గాంధీనగరం, మడికి, చిలకలపాడు, బడుగువానిలంక, చొప్పెల్ల గ్రామాల్లో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన బోధన అందిస్తున్నామని ఉపాధ్యాయులు ప్రజలకు వివరించారు.
2026 పదో తరగతి పరీక్షల్లో చెముడులంక జడ్పీ హైస్కూల్ నుంచి 128 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 119 మంది ఉత్తీర్ణత సాధించి 98 శాతం ఫలితాలు నమోదైనట్లు తెలిపారు. మడికి గ్రామానికి చెందిన చెల్లబోయిన తేజ అశ్విని 581 మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలవగా, గాంధీనగరానికి చెందిన మేడిశెట్టి హరిణి 577 మార్కులు, మడికి గ్రామానికి చెందిన రేలంగి శ్రీనివాస్ 575 మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించినట్లు పేర్కొన్నారు.
అలాగే 550 మార్కులకు పైగా 13 మంది, 500 మార్కులకు పైగా 29 మంది విద్యార్థులు సాధించినట్లు కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశారు. “ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే మంచి ఫలితాలు సాధించవచ్చని, మీ పిల్లలను మా పాఠశాలకు పంపండి” అంటూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరుతున్నారు.
ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రజలను ఆలోచింపజేస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం భమిడిపాటి రామకృష్ణతో పాటు ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు చావలి కామేశ్వరరావు, బత్తిన ప్రపూర్ణ భారతి, చెముడులంక క్లస్టర్ సీఆర్‌ఎంటి పెద్దిరెడ్డి శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్ కుందేటి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

