నందిగామ/వత్సవాయి, పశ్చిమవాహిని మార్చి 05: దేశీయ గోవుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాడి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. సంప్రదాయ మరియు ఆధునిక పాడి పరిశ్రమ పద్ధతులను అనుసరిస్తూ దేశీ జాతి ఆవులను పెంచితే రైతులకు సుస్థిర ఆదాయం సాధ్యమవుతుందని అన్నారు.
గురువారం వత్సవాయి మండలం కంభంపాడులోని చేకూరి రమేష్‌బాబుకు చెందిన సాయిశ్రీనివాస గోశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ గోశాల 2021లో ఆర్‌కేవీఐ పథకం కింద రూ.15 లక్షల రాయితీతో ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఈ గోశాలలో సాహివాల్, గిర్, పుంగనూరు, ఒంగోలు వంటి దేశీ జాతులకు చెందిన 55 ఆవులతో పాడి పరిశ్రమ విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ గోశాలలో ఉత్పత్తి అయ్యే పాలతో ప్రీమియం క్వాలిటీ A2 నెయ్యి తయారు చేస్తున్నారని, నెలకు సుమారు 60 కిలోల నెయ్యి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెయ్యిని లీటరు రూ.3,000 ధరకు మార్కెట్ చేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయ విధానంలో పాలను మరిగించి, పెరుగు చేసి, తరువాత చిలకడం ద్వారా వచ్చే వెన్నతో నెయ్యి తయారు చేస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ నెయ్యికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
అదే విధంగా పంచగవ్య, ద్రవ జీవామృతం వంటి సేంద్రియ ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ముఖ్యంగా దేశీ జాతి ఆవుల నుంచి వచ్చే A2 పాలు, నెయ్యి, పెరుగు వంటి పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. వీటి వినియోగం ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు రైతులకు అధిక ధర లభించే అవకాశం ఉందని వివరించారు.
దేశీ జాతి ఆవుల పెంపకంపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని, పశువుల పోషణ, సంరక్షణ, పాల ఉత్పత్తి పెంపు వంటి అంశాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు అందించే సాంకేతిక సూచనలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఔత్సాహిక రైతులను గుర్తించి వారిని సంఘటితం చేసి A2 పాలు, నెయ్యి ఉత్పత్తి చేసేలా చేయూతనివ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట నందిగామ ఆర్‌డీవో కె. బాలకృష్ణ, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. ఎం. హనుమంతరావు, ఏడీ సత్యప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.



.jpeg)