సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అని అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై త్వరలోనే పుస్తకం ప్రచురించి రాష్ట్రమంతా పంచుతామని తెలిపారు. గతంలో ఒక నాయకుడి అవినీతిపై పుస్తకం వేశారని.. రేవంత్ రెడ్డి.. అవినీతిలో చక్రవర్తి కాబట్టి ఆయన అవినీతిపై పుస్తకంలో సమగ్రంగా వివరిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు కవిత.
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అన్నారు. ఒక్క పింఛన్ మంజూరు చేయలేదని.. పింఛన్లు పెంచలేదని అన్నారు. అప్పు తెచ్చిన రూ.2 లక్షల కోట్లు ఏం చేశారని కవిత ప్రశ్నించారు. తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి తెచ్చిన లోన్ లను కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయానికి తిరిగి చెల్లించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించారని తెలిపారు.
కేసీఆర్ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినా ఏ ఒక్క కాంట్రాక్టర్ కు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్ ల సంస్కృతి మొదలైందని కవిత అన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అనే ప్రాజెక్టు కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు రూ.600 కోట్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు మరో రూ.600 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
2016లో పోలవరం నుంచి బనకచర్ల లింక్ అనే ప్రాజెక్టు ప్రస్తావనే లేదని కవిత గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారంతో కేసీఆర్ పై బురద చల్లుతున్నారని అన్నారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని కవిత అన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించి గోదావరి నీళ్లను గిఫ్ట్ ప్యాక్ గా ఇచ్చారని అన్నారు. ఆంధ్రా బిర్యానీ ఎట్లా ఉంటుందో గతంలోనే కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు.
భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు వెంటనే తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ఆలయం పోలవరంలో మునుగుతున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. పుణే మెట్రో రైల్ కు కేంద్ర కేబినెట్ లో రూ.3,500 కోట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వలేదని కవిత ప్రశ్నించారు.
Social Plugin