Ticker

6/recent/ticker-posts

సింగయ్య కేసులో మరో ట్విస్ట్- హైకోర్టు విచారణ వేళ జగన్ కారుకు..!


ఏపీలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసు కలకలం రేపుతోంది. వైఎస్ జగన్ పల్నాడు టూర్ సందర్భంగా గుంటూరు వద్ద ఆయన కారు కింద పడి సింగయ్య చనిపోవడం, అయినా పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోయారన్న విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఇప్పటికే జగన్ తో పాటు ఈ కేసులో డ్రైవర్ రమణారెడ్డి, వైసీపీ మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేసారు.

ఈ నేపథ్యంలో తనపై దాఖలు చేసిన కేసు కొట్టేయాలంటూ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై స్పందించేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో పోలీసులు కోర్టుకు సమర్పించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రవాణాశాఖ అధికారులు సింగయ్య ప్రమాదానికి కారణమైన జగన్ కారు ఫిట్ నెస్ ను తనిఖీ చేశారు.

ఇప్పటికే సింగయ్య ప్రమాదం రోజు జగన్ ప్రయాణించిన ఫార్చూనర్ కారును సీజ్ చేశారు. అనంతరం దాన్ని గుంటూరు లోి జిల్లీ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు జగన్ వాడిన ఏపీ 40 డీహెచ్ 2349 వాహనం ఫిట్ నెస్ ను రవాణాశాఖ అధికారులు ఇవాళ ఎస్పీ ఆఫీసులో పరీక్షించారు. రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందిన నేపథ్యంలో అసలు ఈ కారుకు ఫిట్ నెస్ సక్రమంగానే ఉందా లేదా తనిఖీ చేశారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. అయితే రిపోర్టు మాత్రం నేరుగా హైకోర్టుకు ఇవ్వనున్నారు.

జగన్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ జరిగిన విచారణలో ప్రభుత్వం స్పందనకు సమయం కోరడంతో మంగళవారానికి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ లోపు జగన్ వాడిన కారు ఫిట్ నెస్ సంగతి తేలితే ఈ రిపోర్టు ఆధారంగా హైకోర్టు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.