ఏలూరు, మే 7: గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గిరిప్రదక్షిణ ప్రారంభ మార్గంలో శ్రీ భూ వరాహ స్వామి వారి మరియు శ్రీవారి పాదముల శిలామూర్తుల ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 6 గంటల 52 నిమిషాలకు ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
మార్కండేయపురం గ్రామానికి చెందిన కూచిపూడి రమేష్ దంపతుల సౌజన్యంతో నిర్మించబడిన ఈ భూ వరాహ స్వామి మరియు శ్రీవారి పాదముల మందిరాల ప్రతిష్ట కార్యక్రమంలో గురువారం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వాస్తు హోమం మరియు స్వామివారి విగ్రహాల అధివాస కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
రాజమండ్రికి చెందిన సత్య పవనాచార్య ఆధ్వర్యంలో, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యుల పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పేరీచర్ల జగపతిరాజు, అబ్బిన దత్తాత్రేయ, దండ ధనరాజు, గొట్టుముక్కల భాస్కరరాజు, వికాస తరంగిణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలను కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ వెల్లడించారు.
శుక్రవారం ఉదయం జరిగే ప్రతిష్ట అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

