Ticker

6/recent/ticker-posts

ఏపీలో ఆ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెరగనుందా?


ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సభ్యులుగా ఉన్నారు. సోమవారం నాటి సమావేశంలో వీరిద్దరితో పాటుగా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వయోపరిమితి పెంపునకు ఉన్న సాధ్యాసాధ్యాలు.. పెంపుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం రోజున భేటీ అయ్యింది. ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆన్‌లైన్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి మంత్రులతో పాటుగా ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశంపై చర్చించారు. మరోవైపు కోర్టు ఆదేశాలతో ఏపీలో 62 ఏళ్ల వయోపరిమితితో 2831 మంది ఉద్యోగులు కొనసాగుతున్నారు. వీరి విషయంపైనా మంత్రివర్గ ఉపసంఘం దృష్టి సారించింది.

మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే.. ప్రభుత్వం మీద ఎంత మేరకు ఆర్థిక భారం పడుతుందనే అంశంపైనా మంత్రి వర్గ ఉపసంఘం చర్చించారు. వేతనాలతో పాటుగా పింఛన్, ఇతర ఆర్థిక అంశాలపై ఎంత మేరకు ప్రభావం పడుతుందనే దానిపైనా మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది. అనంతరం.. ఏపీలో కార్పొరేషన్ల వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య, వయోపరిమితి పెంచితే పడే అదనపు ఆర్థిక భారం వంటి అంశాలపై పూర్తిస్థాయిలో వివరాలను సేకరించి మరోసారి భేటీ కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వీటిపై పూర్తిస్థాయిలో సమగ్ర నివేదికను తయారు చేసిన తర్వాత.. తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

మరోవైపు ఈ మంత్రి వర్గ ఉపసంఘంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, నారాయణ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కేబినెట్ సబ్ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థలలో ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును, సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే 60 నుంచి 62 ఏళ్లకు పెంచే అంశం గురించి ఈ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.