Ticker

6/recent/ticker-posts

దేశంలోనే వినూత్నంగా ఏలూరులో రూ.2 కోట్లతో డిజిటల్ లైబ్రరీ : ఎంపీ పుట్టా మహేష్ కుమార్


ఏలూరు:  ఏలూరు జిల్లాలోని 7 కళాశాలలు, 4 పాఠశాలల్లో ఓఎన్జిసి 2. 50 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటుచేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)లతో కలిసి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గురువారం ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ  దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏలూరులో 2 కోట్ల రూపాయలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు.  డిజిటల్ లైబ్రరీ  వినియోగించుకుని  ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు  తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని ఉద్యోగ అవకాశాలు సాధించాలన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. 

ప్రస్తుతం సమాచార సాంకేతిక వ్యవస్థలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే క్రమంలో పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ ల ద్వారా సమాచార సాంకేతిక రంగంలో శిక్షణ  అందిస్తున్నారన్నారు. ప్రస్తుత భవిష్యత్తు సమాచార సాంకేతిక వ్యవస్థదేనని, ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సు లో ప్రతిభ కనపరచిన వారికి ఉన్నతస్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని , రాష్ట్రంలో క్వాంటం కంప్యూటర్ కేంద్రం ఏర్పాటు ద్వారా యువతకు సాఫ్ట్ వేర్ రంగంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు.  ఏలూరు డిగ్రీ కళాశాలకు అవసరమైన భవనాలు, తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. 
      
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు విద్య ప్రధాన మార్గమన్నారు.   విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాదించేందుకు ఇష్టంతో చదవాలన్నారు.  ప్రస్తుత రోజులలో సమాచార సాంకేతిక వ్యవస్థదే రోజులని, పాఠశాల స్థాయి నుండే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా పొంది ఉండాలన్నారు. 

ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య  (చంటి) మాట్లాడుతూ విద్యావంతుడు, పారిశ్రామికవేత్త పుట్టా మహేష్ కుమార్  ఏలూరు పార్లమెంట్ సభ్యులు కావడం నియోజకవర్గం అదృష్టమని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర రాజధానికి దగ్గరగా రైల్వే, రోడ్డు, విమాన రవాణా సౌకర్యాలకు కలిగి ఉన్న   ఏలూరు నియోజకవర్గాన్ని సాఫ్ట్ వేర్ హబ్ గా తీర్చిదిద్దెందుకు ఏలూరు పరిసరాలలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటుకు చొరవ చూపాలని ఎంపీని ఎమ్మెల్యే కోరారు. 

కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఓఎన్ జి సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యప్రసాద్, ఓఆర్సిసి పీడీ బండారు నిహా, తహసీల్దార్ గాయత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గిరిబాబు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజ్ కృష్ణ, పాఠశాల ప్రధానోపాద్యాయులు ఫణింద్ర, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్, పూజారి నిరంజన్, అవినాష్, శ్యాం, రంజిత్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.