జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడెం వెళ్లే హైవేపై వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలో ఇసుక డ్రమ్ముల సహాయంతో స్పీడ్ కంట్రోలర్లు ఏర్పాటు చేసి, వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా రహదారి ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
అలాగే రహదారి ప్రమాదాల్లో యువత, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా బాధితులవుతున్నారని, హెల్మెట్ ధరించడం వల్ల అది తలకు భారం కాకుండా ప్రాణ రక్షణగా మారుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం తమ కుటుంబ భద్రతకే శ్రేయస్కరమని సూచించారు.
ఈ సందర్భంగా జంగారెడ్డి గూడెం ఎస్‌ఐ వీర ప్రసాద్ మాట్లాడుతూ, “ప్రపంచానికి మీరు ఒక్కరే కాకపోయినా, మీ కుటుంబానికి మాత్రం మీరు అన్నింటికంటే ముఖ్యులు. అందువల్ల వాహనాలు నడుపుతున్నప్పుడు అతి వేగానికి దూరంగా ఉండాలి. వేగం వద్దు ప్రాణం ముద్దు’ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలకు స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, జంగారెడ్డిగూడెం పోలీస్ సిబ్బందిని అభినందించారు.


.jpeg)
